Thursday 22 November 2018

         గెట్టింగ్_హోమ్" అనబడు సినిమా- కొన్ని కన్నీళ్ళూ

గత కొన్నేళ్ళుగా నన్ను వెంటాడుతున్న సినిమా ఇది. 2007 లో వచ్చిన చైనీస్ సినిమా. నేను చూసింది మాత్రం 2015 చివర్లలో. ఏమో ఎక్కడ పొరపాటు జరిగిందో గానీ మనకు చైనీస్ సినిమా అంటే బ్రూస్ లీ, జాకీచాన్ లాంటి ఫైటింగ్ సినిమాలో మరీ కాదంటే మార్షల్ ఆర్ట్ ప్రధానంగా సాగే వార్ జోన్ సినిమాలో తప్ప పెద్దగా భారతీయ భాషల్లోకి రాలేదు. ఇక హాలీవుడ్ మీదున్న మోజు చైనా సినిమాల లోలోతులకి మనలని వెళ్లనివ్వనూ లేదు. అట్లా చీనీ సినిమాలో ఉండే ఒక సున్నితమైన జోనర్ ని మనం చాలా ఆలస్యంగా చేరుకున్నాం...
ఒక చైనీస్ దర్షకుడున్నాడు. తని పేరు ఝాంగ్ యాంగ్. జెట్ లీ, డెవిడ్ చాంగ్ లాంటి ఫైటింగుల డైరెక్టర్ కాదతను. చైనాసినిమాలో మనకు తెలియని జోనర్ ఒకటుంది. "మార్నింగ్ సన్" "థండర్ ఇన్ ద ఈస్ట్" లాంటి సినిమాలకు చైర్మన్ మావో దర్శకత్వం వహించారని తెలిసిన వాళ్ళు చాలా తక్కువే అనుకోవాలి. అలా ఒక మానవీయ కోణాన్నీ దానిలోనే మనం ఎదుర్కుంటున్న, ఎదుర్కోబోతున్న సామ్రజ్యవాద ప్రమాదాన్నీ అంతర్లీనంగా చెప్పి వదిలేస్తాడు. 2013 లో వచ్చిన "స్ట్రే డాగ్స్" కావొచ్చూ, 2015 లో వచ్చిన "మౌంటెయిన్స్ మే డిపార్ట్" కావొచ్చూ ఝాంగ్ ప్రజెంట్ చేసే తీరు అత్యద్బుతం. ఇక మనం ప్రస్తుత సినిమాకి వస్తే. ఇదొక మామూలు నిర్మాణ విలువలున్న సినిమానే ఒక్కటంటే ఒక్క ఫైటింగ్ ఉండదు, కనీసం అందమైన చైనా హీరోయిన్ ఉండదు... కానీ ఒక్క సారి చూస్తే ఒక జీవిత కాలం పాటు వెంటాడే సినిమా ఇది.
సాధారణ వలస జీవితాల కథ ఇది. చెరోపల్లెనుంచీ బతుకుదెరువుకోసం నగరానికి చేరి మిత్రులయ్యారు జో, లీ. ఈద్దరికీ సాయంత్రం పూట సేదతీర్చేది ఒక చీప్ బార్. రోజంతా పని, సాయంత్రం ఆ అలుపు తీర్చుకోవటానికి, రెండు మాటలు చెప్పుకోవటానికీ కాస్త తక్కువ రకం మందూ. ఇలా సాగిపోతూంటుంది వాళ్ళ జీవితం.
అయితే లీ కి సొంత ఊళ్ళో ఒకకుటుంబం ఉంది. వాళ్ళకోసం ఇక్కడికి వచ్చి పని చేస్తున్నాడు కానీ జో ఒక ఒంటరి అతనికి ఎవరూ లేరు. అందుకే తన మరణం తర్వాత తన శవం అనాధగా కాకుండా తన సొంత ఊరిలోనే ఖననం చేయబడాలని జో కోరిక అదే మాటని తరచూ లీ కి చెప్తాడు. తన ఊరిలోనే తన అంత్యక్రియలు జరగాలని, జరిపించాలనీ లీదగ్గర మాట కూడా తీసుకుంటాడు. కానీ అనుకున్నది అనుకున్నట్టు జరిగితే జీవితం ఎలా అవుతుందీ. జో కన్నా ముందే లీ మరణిస్తాడు. వలస జీవితం లో ఉన్న ఎవడి కోరికైనా ఒకటే కదా. అందుకే స్నేహితుడి అంత్య క్రియలు అతని ఊరిలోనే జరిపించాలనుకుంటాడు జో. కానీ అతని దగ్గర ఉన్న డబ్బూ, అప్పటివరకూ లీ సంపాదించిన డబ్బూ మొత్తం కలిపినా ప్రత్యేక వాహనం లో శవాన్ని తీసుకు పోలేడు ఎలా?
జో ఒక పన్నాగం పన్నుతాడు లీ శరీరానికి మేకప్ వేసి కళ్ళకు సన్ గ్లాసెస్ పెట్టి బస్సెక్కుతాడు. కానీ దారి మధ్యలో దొంగలు బస్సును దోచుకునే సమయం లో నిజం బయట పడుతుంది. కానీ ఈ ఇద్దరి కథనీ విన్న దొంగలు అప్పటివరకూ బస్సులో దోచుకున్న డబ్బంతా జో చేతిలో పెట్టి లీ శరీరాన్ని జాగ్రత్తగా తీసుకెళ్ళమని చెప్పి వెళ్ళిపోతారు. అయితే బస్సులో ఉన్న ప్రయాణీకులు మాత్రం జో మీద పడి మొత్తం డబ్బు లాగేసుకుంటారు. పాపం వీళ్ళు దొంగలు కాదు కదా అందుకే వాళ్ళ డబ్బుతో పాటు జో దగ్గర ఉన్న ఉన్న డబ్బుని కూడా లాక్కొని అతన్నీ, లీ శరీరాన్నీ రోడ్డు మధ్యలో దింపేస్తారు. అక్కడినుంచీ మొదలవుతుందో అత్యద్బుత ప్రయాణం మరణించిన ప్రపంచం తో కలిసి జో చేసే ప్రయాణం.
ఫ్రెండ్ శరీరాన్ని భుజాల మీద మోసుకుంటూ ఒక టౌన్ కి చేరుకుంటాడు. తన దగ్గర మిగిలిన అతి తక్కువ డబ్బుల్లొంచి కొన్ని డబ్బులతో ఒక చిన్న హొటల్లో దిగితే తెల్లరే సరికి ఇతనిదగ్గరున్న కొన్ని డబ్బులని కూడా మాయం చేసి బయటికి గెంటేస్తారు హోటల్ వాళ్ళు. అక్కడినుంచీ మళ్ళీ లీని మోసుకుంటూ వెళ్తాడు, మధ్యలో ట్రాక్టర్లోనూ కొంత దూరం, ఒక పాత టైరులో కొంత దూరం శవాన్ని తరలిస్తాడు. ప్రతీ అడుగూ అతన్ని మనుషులకూ, నమ్మకాలకూ దూరంగా చేసేదే అయినా ఎక్కడా చుట్టూ ఉన్న మనుషులని నమ్మటం తగ్గినట్టు కనపడదు జో లో. ఆకలి బాధతో ఒక ఊరిని చేరుకుని అక్కడ జరిగే ఒక వృద్దుని అంత్య క్రియల్లో పాల్గొంటాడు. అయితే అవి నిజమైన ఫ్యునరల్స్ కాదు ఒక వేళ తాను చని పోయాక ఎవరూ సరిగా జరపరేమో అని తాను బతికుండగానే అంత్య క్రియలు జరిపించుకున్నానని బోజనాల సమయం లో చెప్తాడా వృద్దుడు. అతని అంత్యక్రియల్లో జో గుండెలు పగిలేలా ఏడ్చినందుకు మెచ్చుకుంటాడు కూడా. మళ్ళీ ఊరిచివరికి వచ్చి లీ శరీరం తో పాటు ప్రయాణం మొదలు పెడతాడు జో.
కానీ అంతకంతకూ లీ శరీరాన్ని మోయటం కష్టం అవుతూనే ఉంటుంది జోకి. ఒక సారి లీ బట్టల్లో కొన్ని డబ్బులు దొరుకుతాయి. వాటితో ఒక వాహనం మట్లాడి వెళ్ళిపోవాలనుకుంటాడు కానీ చివరికి అవీ దొంగ నోట్లు అని తెలుస్తుంది. తీవ్రమైన నిరాశతో ఇక లీ శవాన్ని పాతిపెట్టాలనుకొని గొయ్యి తవ్వి అలసిపోయి ఆ గొతిలోనే నిద్ర పోతాడు. ఆత్మహత్య చేసుకోవాలనీ చూస్తాడు కానీ లీ ని చూడగానే కర్తవ్యం గుర్తొస్తుంది. స్నేహితున్ని అలా అనాధగా వదలాలనిపించదు. మళ్ళీ భుజాలమీద వేసుకొని ప్రయాణం మొదలు పెడతాడు. అయితే ఈ సారి పోలీసులకు చిక్కుతాడు ఆ పాటికి లీ ఊరు కాస్త దగ్గరలోనే ఉన్నా దాదాపు కుళ్ళిపోయిన దశలో ఉన్న ఆ శవాన్ని పోలీసులు కాల్చేస్తారు. వీళ్ళ కథని విని వాళ్ళ హృదయం ద్రవించి పోతుంది. లీ "యాషెస్" ని జో చేతిలో పెట్టి ఆ ఊరిదగ్గర దింపుతారు. అయితే... అక్కడ అడుగు పెట్టగానే గుండె బద్దలయ్యే నిజం తెలుస్తుంది.
అక్కడ కొత్తగా కట్టబోయే ప్రాజెక్టు వల్ల ఆ ఊరిని ఖాళీ చేయిస్తోంది ప్రభుత్వం. లీ ఒక్కడే కాదు అతను పుట్టి పెరిగిన ఊరు చచ్చిపోయింది, అతని జన్మ భూమి మరణించింది. ఎక్కడైతే, ఏ తల్లి ఒడిలో అతను శాస్వత నిద్ర పోవాలనుకున్నాడో ఆ ఊరు ఇక ఉండదు... ఊళ్ళో ఉన్న ప్రజలతో పాటు లీ కుటుంబం కూడా వేరే చోటికి వెళ్ళిపోయింది. ఇంత దూరం చేసిన ప్రయాణానికి అర్థం ఏమిటో అర్థం కాని స్థితిలో. పాడుపడబోతున్న ఊరిలో లీ ఇంటి తలుపు మీద రాసి ఉన్న కొత్త అడ్రెస్ కి బయలుదేరటానికి సిద్దమవుతాడు జో. అక్కడితో "గెట్టింగ్ హోం" అనే అతి సాధారణ కథతో నడిచిన సినిమా ముగిసిపోతుంది. కానీ చూసిన ప్రేక్షకుడి భుజాల మీద లీ శరీరం బరువుగా అనిపిస్తుంది. జో క్యారెక్టర్ గుండెల్లో నడుస్తున్నట్టు ఉంటుంది....

Comments